Home ఆంధ్రప్రదేశ్ అమరావతి JNI Today / ఏపీ బార్లలో మద్యం సరఫరా వేళలు కుదింపు

JNI Today / ఏపీ బార్లలో మద్యం సరఫరా వేళలు కుదింపు

0
23

JNI Today అమరావతి: రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్టార్‌ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40 శాతానికి తగ్గించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. బార్ల విధానంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. బార్ల సంఖ్యను 50శాతానికి తగ్గించాలని తొలుత సీఎం ప్రతిపాదించగా.. ఇప్పటికే మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించామని, విడతల వారీగా తగ్గిద్దామని అధికారులు సూచించారు. దీనిపై సుదీర్ఘ చర్చ అనంతరం బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

దీంతోపాటు బార్లలో మద్యం సరఫరా వేళలను కూడా కుదించాలని సమావేశంలో నిర్ణయించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం సరఫరా చేయాలని, రాత్రి 11 వరకు ఆహారం సరఫరా చేయాలని సీఎం సూచించారు. స్టార్‌ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు మద్యం సరఫరా చేయవచ్చని నిర్ణయించారు. మద్యం కల్తీ, స్మగ్లింగ్‌తో పాటు నాటుసారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిందితులపై నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. మరోవైపు బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.