Home జాతీయం JNI Today / ‘భారత్‌లోకి 75 మంది ఉగ్రవాదులు’

JNI Today / ‘భారత్‌లోకి 75 మంది ఉగ్రవాదులు’

0
13

JNI Today దిల్లీ: ఆగస్టు 5 నుంచి ఇప్పటి వరకు మొత్తం 75 మంది ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఆయా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పటి నుంచి నేటి వరకు 75 మంది ఉగ్రవాదులు సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించారు. పలు చోట్ల దాడులు చేసేందుకు వారు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై గత కొద్ది వారాలుగా ఇంటెలెజెన్స్‌ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. మరోవైపు భారత్‌లో ఉంటున్న ఇజ్రాయెల్‌కు చెందిన యూధులపై దాడులు జరిగే అవకాశం ఉందని, ఇందుకోసం అల్‌ఖైదా, ఐసిస్‌ ప్రణాళికలు రచించినట్లు వెల్లడించాయి.

నవంబర్‌ 16న బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో భద్రతాదళాలు, పోలీసులు సంయుక్తంగా ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోపోర్‌ ప్రాంతంలో ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోచోట కుప్వారాలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేసినట్లు కశ్మీర్‌జోన్‌ పోలీసులు తెలిపారు.