Home తాజా వార్తలు JNI Today / నాణ్యతా ప్రమాణాలు లేకుంటే కఠిన చర్యలే – ఆరోగ్యశాఖాధికారి డాక్టర్...

JNI Today / నాణ్యతా ప్రమాణాలు లేకుంటే కఠిన చర్యలే – ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ

0
3

JNI Today నెల్లూరు : ఆహార పదార్ధాల తయారీలో నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో ఘోరంగా విఫలమైందని ప్రకటిస్తూ జిల్లా సర్వజన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి క్యాంటీన్ ను నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ సీజ్ చేసారు. ఆయన నేతృత్వంలో ఆసుపత్రిలోని నర్సింగ్ కళాశాల క్యాంటీన్, ఆసుపత్రిలోని రోగులకు భోజనం అందించే క్యాంటీన్లపై శనివారం దాడులు నిర్వహించారు. వంటశాలల్లో అపరిశుభ్ర వాతావరణం, చెడిపోయిన కూరగాయల వాడకం, బియ్యంలో పురుగులు, బొద్దింకల సంచారం వంటి వివిధ అంశాలను గమనించిన డాక్టర్ మాట్లాడుతూ ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో ఆసుపత్రి క్యాంటీన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇలాంటి భోజనం తీసుకుంటే, కోలుకోవాల్సిన రోగులు మరింత రోగగ్రస్తులుగా మారుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులకు భోజనం అందిస్తున్న క్యాంటీన్ నిర్వహణలో నిర్వాహకులకు వివిధ సూచనలు అందించామని, వారంరోజులలోపు అవన్నీ అమలు కావాలని ఆదేశించామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థల్లో క్యాంటీన్ల ద్వారా ఆహారం అందించే నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆ ధోరణిని వెంటనే మానుకోవాలని డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు. హోటళ్లు, మాంసపు దుకాణాల్లో నిల్వ ఆహార పదార్ధాలను ప్రజలు గుర్తిస్తే యాజమాన్యాలను నిలదీయాలని, కార్పొరేషన్ అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలని డాక్టర్ సూచించారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందేవరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఆరోగ్యశాఖ వెటర్నరీ వైద్యులు మదన్ మోహన్, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.