Home తాజా వార్తలు ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు అస్వస్థత

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు అస్వస్థత

0
4

ముంబై : భారతీయ సినీమా చరిత్రలో ఎప్పటికీ మరువలేని..మరపురాని పాటలతో కోట్ల మంది ప్రేక్షకుల మనసు దోచిన లెజండరీ గాయని లతా మంగేష్కర్ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం అర్థరాత్రి 1.30 సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఆమె ఇబ్బందికి గురవడంతో వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆమెను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె తన గానామృతంతో ఎంతో మంది హీరోయిన్లకు హిట్ సాంగ్స్ అందించారు. లతా మంగేష్కర్ ఆల్భామ్ అంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అనే టాక్ బాలీవుడ్ లో ఉంది.

గత కొన్ని రోజులుగా ఆమెకు శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రి సీనియర్ వైద్య సలహాదారు డాక్టర్ ఫరోఖ్ ఇ ఉద్వాడియా పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు. 90 సంవత్సరాలు ఉన్న లతా మంగేష్కర్‌ దాదాపుగా 25 వేలకు పైగా సోలో సాంగ్స్ పాడి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమె పాటలు పాడడం ఆపేసింది. భారత ప్రభుత్వం లతను పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. చిన్న వయసులోనే పాట కచేరీలు చేస్తూ ఎంతో మంది దృష్టి ఆకర్షించారు లతా మంగేష్కర్.

ప్రస్తుతం ఆమె సినిమా పాటలు కాకుండా కేవలం భక్తి పాటలను మాత్రమే పాడుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం సహకరించకపోవడం ఒక కారణమైతే, ఇప్పుడు సినిమాల్లో వస్తున్న పాటలన్నీ బూతు పదాలతో నిండిపోయి ఉన్నాయని అలాంటి పాటలను తాను పాడనని బాహాటంగానే చెప్పేశారు. లతా మంగేష్కర్ అస్వస్థతకు గురి అయ్యారని తెలుసుకొని పలువురు బాలీవుడ్ సెలబ్రెటీస్ ఆమెను పలకరించారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం.