Home చిట్కాలు JNI Today / జీవ వైవిధ్యం మానవాళి మనుగడ

JNI Today / జీవ వైవిధ్యం మానవాళి మనుగడ

0
142

JNI Today : ప్రపంచంలో వివిధ ఆవాసాల్లో ఉండే వైవిధ్య భరితమైన వృక్షాలు, జంతువులు వాటి వాటి ప్రత్యేక గుణగణాలతో జీవనం సాగించడమే జీవ వైవిధ్యం. ఈ వృక్ష జంతు జాతుల్లో అతి చిన్నవీ ఉండవచ్చు. అతి పెద్దవీ ఉండవచ్చు. ఈ జీవ వైవిధ్యం ఎందుకు అవసరమంటే, పర్యావరణాన్ని సమతులంగా ఉంచడానికే. మానవాళి మనుగడ కోసమే- మనం పెరట్లో నాటుకున్న మొక్క కూడా జీవ వైవిధ్యానికి ఒక ఉదాహరణే. మనకు కనిపించేది మొక్క ఒక్కటే కాని, కనిపించని సూక్ష్మక్రిములు మట్టిలో ఎన్నో ఉంటాయి. అంటే ఏక కాలంలో ఒకే చోట ఒకే పర్యావరణంలో జీవిస్తున్న భిన్నమైన వృక్ష, జంతు జాతులన్నింటినీ కలిపి ‘జీవవైవిధ్యం’ అనే ఒక్క మాటతో చెప్పుకుంటున్నామన్నమాట. ప్రపంచ జనాభాలోని సుమారు ఎనభై శాతం మంది నేరుగా ఈ జీవ వైవిధ్యం మీదనే ఆధారపడి ఉన్నారు. అలాగే నలభై శాతం ఆర్థిక వ్యవస్థ దీని మీదే ఆధారపడి ఉంది. జీవ వైవిధ్యం పరిఢవిల్లుతుంటేనే వైద్యపరమైన మందుల తయారీకి, అలాగే వ్యవసాయ రంగానికి, ఇతరత్రా అనేక రంగాలకు సంబంధించిన పరిశోధనలు సజావుగా సాగుతాయి. 22 మే, ఇంటర్నేషనల్‌ బయోడైవర్సిటీ డే సందర్భంగా జీవ వైవిధ్యంపై ఇస్తున్న కవర్‌ స్టోరీ ఇది.
ఇంగ్లీషులో BIODIVERSITY అనే పదం రెండు పదాల కలయిక. BIO అంటే జీవ సంబంభమైన, DIVERSITYఅంటే వైవిధ్యం. ఈ భూమి మీద ఉన్న చెట్లు, జంతువులు, ఫంగి, సూక్ష్మక్రిములు వగైరా అన్నీ ఆ భిన్నమైన, వైవిధ్య భరితమైన జీవుల్లోకి వస్తాయి. జీవ వైవిధ్యానికి అక్కడి ఉష్ణోగ్రతకు, అవి నివసించే ఆల్టిట్యూడ్‌కు, జీవావరణానికీ, జీవ భూగోళానికి (BIOGEOGRAPHY)దగ్గరి సంబంధాలు వుంటాయి. జీవ వైవిధ్యానికి ఉదాహరణలు చెప్పుకోవాలంటే ఒక నీటి చుక్క కావచ్చు, సరస్సు కావచ్చు, సముద్రం కావచ్చు… కంటికి కనపడని సూక్ష్మక్రిములు ఈ నీటిలో ఉన్నాయి. అలాగే సరుస్సుల్లో, సముద్రాల్లో జలచరాలు ఉన్నాయి. అంతా జీవ వైవిధ్యమే.
ఇంకా లోతులోకి వెళ్లి ఈ వైవిధ్యాన్ని గమనిస్తే ఒకే చోట ఉన్న వృక్ష, జంతు జాతుల మధ్య వైవిధ్యం, జంతువుల మధ్య వైవిధ్యమే కాదు; ఒక జాతికి, ఒక జీవికి సంబంధించిన జన్యు వైవిధ్యం కూడా ఉంటుంది. భూమి మీద జీవించే జీవుల్లో వైవిధ్యం, సముద్రంలో జీవించే జీవుల్లో వైవిధ్యం, మంచినీటి చెరువుల్లో జీవించే జీవుల్లో వైవిధ్యం, గాలిలో జీవించే జీవుల్లో వైరుధ్యం వగైరా- విభజన చేసుకుని అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. హేతుబద్ధంగా ఆలోచించగల వారే ఇలాంటి పరిశోధనలు చేస్తారు. ఏ దైవ శక్తినో నమ్ముకుంటే చేయలేరు. హేతువుతోనే పరిశోధన- పరిశోధనతోనే అభివృద్ధి. జీవ వైవిధ్యం ప్రకృతి అందించిన సంపద. దాన్ని కాపాడుకోవడం ఆధునికుడి మొదటి బాధ్యత. ఎందుకంటే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అంశాలన్నీ దానితోనే ముడివడి ఉన్నాయి. ఆహారం, పాడిపంటలు, చేపలు, వంటి వాటికోసం ఆధునికుడు జీవుల పైనే ఆధారపడి ఉన్నాడు. అలాగే అనేక పరిశ్రమలకు జీవులే ఆధారం. బట్టలు, పీచు, పేపర్‌, వాక్స్‌, రబ్బర్‌, ఉన్ని, సిల్కు, తోలు, లూబ్రికెంట్స్‌, పర్‌ఫ్యూమ్స్‌ వంటి ఏ పరిశ్రమను తీసుకున్నా మొత్తానికి మొత్తంగా అన్నీ వృక్ష, జంతు సంబంధమైనవే. అలాంటప్పుడు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమన్నది అందరూ గ్రహించుకోవాలి.
భూమి (నేల) మీద రెండు లక్షల ఇరవై వేల వృక్ష జాతులుంటే సుమారు పది లక్షల జీవ జాతులు సముద్రంలో ఉన్నాయి. కీటకాలు సుమారు మూడు కోట్ల జాతులు, ఒక కోటి బాక్టీరియా, యాభై లక్షలు ఫంగి జాతులూ ఉన్నాయి. వీటన్నిటి లోంచి అధ్యయనం చేసి, మందుల తయారీలో వాడుతున్నది కేవలం ఐదు వేల జీవ జాతులే. అంటే పరిశోధనలకు ఇంకా ఎంత అవకాశం ఉన్నదో అర్థమవుతోంది కదా? వీటన్నిటి శరీర నిర్మాణాలను, నడవడికలను, శరీర ధర్మాలను అర్థం చేసుకుని వాటివల్ల లాభాలు, నష్టాలు అధ్యయనం చేయడం ఎంతో కష్టమైన పని. పరిశోధకులు తమ జీవితాల్ని ధారవోయాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులకి, పీఠాధిపతులకి, బాబాలకి, జ్యోతిష్కులకి, ప్రవచన పండితులకు ఇవేం పట్టవు. మాటల తూటాలు పేలుస్తూ జనాన్ని మతాల పిచ్చిలో, కులాల పిచ్చిలో ముంచుతూ ఎలాగో తమ పబ్బం గడుపుకుంటుంటారు.
జీవ వైవిధ్యం వల లాంటిది
”విస్తారంగా ఉన్న ఇన్ని వృక్ష, జంతు జాతుల్లో ఏదో ఒకటి అంతరించిపోతే నష్టం ఏమిటీ?”- అని కొందరు అమాయకంగానో లేక అవగాహనా రాహిత్యంతోనో అనుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక నెట్‌వర్క్‌. ఉదాహరణకు పెద్ద వల ఒకటి రెండు చోట్ల తెగిపోతే ఏమవుతుంది? వల బలహీనపడుతుంది. క్రమంగా మిగతా చోట్ల కూడా తెగడం ప్రారంభమవుతుంది. దాదాపు ఈ జీవ శృంఖలం కూడా అంతే. కొన్ని జీవరాసులు నశించినా దాని ప్రభావం అన్ని జీవుల మీద పడుతుంది. పర్యావరణం దెబ్బతిని దుష్ఫలితం మనుషులమీద పడుతుంది. ఒక గొప్ప చారిత్రక కట్టడం ఏ కారణం వల్లలైనా కూలిపోతే మళ్లీ దాన్ని నిర్మించుకోవచ్చు. కానీ, అంతరించి పోయిన వృక్ష, జంతుజాలాన్ని ఎప్పటికీ పునరుద్ధరించుకోలేం. ఏ జీవి అయినా తనకుతానుగా స్వతంత్రంగా మనుగడ సాగించలేదు. తప్పనిసరిగా ఇతర జీవుల మీద ఆధారపడాల్సిందే. ఇదొక శృంఖలం!
కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ…
ఏ దేశంలో నైతే జీవ వైవిధ్యం కాపాడబడుతుందో ఆ దేశం సమృద్ధిగా ఉంటుంది. మనిషి తన తప్పిదాల వల్ల భూమిని ఎడారిగా మారుస్తూ పోతే ఇక అక్కడ జీవం ఎక్కడా? నిర్దాక్షిణ్యంగా చెట్టుకొట్టడం, జంతువుల్ని చంపడం, పెస్టిసైడ్‌ల వాడకం, పంటభూముల్ని కలుషితం చేయడం, విష రసాయనాలను విపరీతంగా వాడటం, వాడిన ప్లాస్టిక్‌నంతా నదీజలాల్లోకి, సముద్రాల్లోకి వదిలేయడం వగైరాలతో పర్యావరణాన్ని తీవ్రంగా పాడుచేయడం జరుగుతోంది. ఫలితంగానే భూ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. రుతువుల్లో మార్పు వస్తోంది. కాలుష్యాల ప్రభావాలను మళ్లీ అనుభవించాల్సింది మనిషే కదా? ఆ విషయం మనిషి గుర్తుంచుకోవడం లేదు. ఒక చెట్టును కొట్టేస్తే… కొట్టింది ఆ చెట్టును మాత్రమే కాదు, దాని మీద ఆధారపడి ఉన్న ఎన్నో పక్షుల్ని, జంతువుల్ని, మనుషుల్ని కొట్టేసినట్టు- అందువల్ల కనీసం తన మనుగడ కోసమైనా మనిషి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంది.
జీవ వైవిధ్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్నవారు ఇతరులకు చెప్పడానికి- అనేక రూపాలలో దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో జీవ వైవిధ్యదినాన్ని జరుపుకుంటున్నాం. జీవ వైవిధ్యానికి ఒక రోజును కేటాయించాలని 1993 డిసెంబర్‌ 29న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానించింది. అప్పటి నుండి అన్ని దేశాలూ దీనికి విస్తృత ప్రచారం ఇస్తున్నాయి. మనం దీన్ని 22 మే రోజున జరుపుకుంటున్నాం.
జీవరాసులు భూమండలమంతా ఒకే విధంగా వ్యాపించిలేవు. భూమధ్యరేఖకు దగ్గరలో ఉన్న దేశాల్లో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది గనుక అక్కడ జీవ వైవిధ్యం కూడా ఎక్కువ. భూ వైశాల్యంలో అడవి ప్రాంతాలున్నది పది శాతమే అయినా తొంభయి శాతం జీవ జాతులు ఇందులోనే ఉన్నాయి. ఇక సముద్ర జీవ వైవిధ్యానికి వస్తే పడమటి పసిఫిక్‌ మహా సముద్రంలో అది ఎక్కువ. పర్యావరణంలో వచ్చే మార్పుల వల్ల తీవ్ర గతిన జీవరాసులు అంతరించి పోతున్నాయి. ఒకప్పుడు భూమి మీద సజావుగా సంచరించిన ఐదు బిలియన్‌ జీవ జాతులు (అంటే 99.9 శాతం) అంతరించిపొయ్యాయి. ప్రస్తుతం భూమిమీద సజీవంగా ఉన్న జీవ జాతులు సుమారు కోటి నుండి కోటి నలభై లక్షలు. అందులో పరిశోధకుల గణనలోకి వచ్చినవి కేవలం 12 లక్షలు మాత్రమే. ఈ పన్నెండులో 86 శాతం వృక్ష జంతు జాతుల రూపురేఖల్ని శాస్త్రవేత్తలింకా వివరించలేదు. అంటే ఇంతగా నిరంతర కృషి జరుగుతూ ఉన్నా జరగాల్సింది ఇంకా ఎంతో ఉందని తెలుస్తూనే ఉంది. భూమి మీద ఉన్న మొత్తం డిఎన్‌ఎ బేస్‌ పెయిర్స్‌ 5.0×1037 బరువు యాభై బిలియన్‌ టన్నులు. మూలవాసుల చివరి సంతతి(Last Universal Common Ancestor- LUCA) నుండి జీవ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు గుర్తుపట్టి విశదీకరించిన జన్యు జతల సంఖ్య -356.
అట్టడుగు పొరల్లోకి ఇంకిపోవాలి 
జీవ వైవిధ్య ప్రాముఖ్యం గురించి అంతర్జాతీయ సదస్సులలో తీర్మానాలు తీసుకోవడమే కాదు, అన్ని దేశాల ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రయివేటు సంస్థలు స్పందించాల్సి ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి ఆలోచనా విధానంలో మార్పు రావాలి. భూమిని, నదుల్ని, సముద్రాల్ని నాశనం చేసుకుంటూ బంగారు భవిత కోసం కలలు గనడం వృథా! జాతి, కుల, మత, భాషా, ప్రాంతీయ భేదాల్ని చూపి మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా విడగొడుతున్న క్షుద్ర రాజకీయాలున్నంత కాలం ఆశించిన ఫలితాలు రావు. సామాన్య జనం వైజ్ఞానిక స్పృహను పెంచుకోకుండా మూర్ఖపు నమ్మకాల్లో పడి కొట్టుకు చస్తుండాలని ఆధిపత్యవర్గాలు కోరుకుంటున్నంత కాలం, అజమాయిషీ చేస్తున్నంత కాలం మార్పు రాదు. వైజ్ఞానికుల గొప్ప నిర్ణయాలన్నీ సమాజపు పై పొరల్లో తేలిపోకుండా సమాజపు అట్టడుగు పొరల్లోకి ఇంకిపోవాలి. శాస్త్ర, సామాజిక, సాంకేతిక విషయమేదైనా తీసుకోండి, సామాన్యుల అవగాహనా స్థాయి పెరగనంత కాలం మార్పు రాదు. విశ్వసనీయత, విశ్వజనీనత పెరగాలి. ధరిత్రీ దినమని, పర్యావరణ దినమని, జీవవైవిధ్య దినమని ఊరికే రోజులు కేటాయించుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. మూఢత్వంలో కొట్టుకుపోతున్న మన భారతదేశంలో మార్పు రావాలంటే ముందు హృదయాలు విశాలమవ్వాలి. మెదడ్లు పుష్పించాలి. మానవ జాతి దీర్ఘకాలిక ప్రయోజనాల్ని అర్థం చేసుకోగలగాలి. అదెప్పుడు సాధ్యమంటే- సామాన్యులంతా అజ్ఞానాంధకారాన్ని తుత్తునియలు చేయడానికి పిడికిళ్లు బిగించినప్పుడు! అన్ని ప్రాంతాల్లో అన్ని దేశాల్లో సమస్య ఒకే విధంగా ఉండదు. ఒక్కో చోట ఒక్కో ప్రత్యేక సమస్య ఉంటుంది. అలాగే ఒక్కో ప్రాంతంలో ప్రజల అవగాహనా స్థాయి ఒక్కో విధంగా ఉంటుంది. అందువల్ల అందుకు సంబంధించిన నిర్ణయాలు, ఆచరణా వేరు వేరుగా ఉండాలి. కనీసం 2020 నాటికి ప్రపంచ పౌరులందరికీ జీవ వైవిధ్యంపై అవగాహన పెంచగలగాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భూమి వయసు సుమారు 4.54 బిలియన్‌ (సుమారు 450 కోట్లు) సంవత్సరాలు. కొన్ని బిలియన్‌ సంవత్సరాల కాలం తర్వాత మాత్రమే జీవులు భూమి మీద ఉద్భవించాయి. ప్రపథమ జీవులు 3.5 మిలియన్‌ (35 లక్షలు) సంవత్సరాలకు పూర్వం ఏర్పడ్డాయి. ఈ 35 లక్షల సంవత్సరాల్లో జరిగిన జీవ పరిణామానికి ఫలితమే ఇప్పుడు సజీవంగా ఉన్న వృక్ష, జంతు జాతులు. వీటిలో కొన్ని మనుషుల అవగాహనా రాహిత్యం వల్ల, అజాగ్రత్త వల్ల ఈ భూమి మీద అధికారం తమదేననే ఒక తప్పుడు అహంభావం వల్ల గనక అంతరించి పోతే, జరిగేదేమిటి? 35 లక్షల ఏండ్లుగా కొనసాగుతూ వస్తున్న జీవ పరిణామ క్రమాన్ని అడ్డుకుంటున్నట్టు- లేదా భూ స్థాపితం చేస్తున్నట్టు- ఇది ఊరికే తేలికగా తీసుకునే విషయం కాదు. చాలా సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం. ప్రపంచస్థాయి శాస్త్రవేత్తల బృందం ఈ ఏడాది తమ అధ్యయనాన్ని ‘సైన్స్‌ అడ్వాన్సెస్‌’ అనే జర్నల్‌లో ప్రకటించారు. ఈ భూమినీ, జవ వైవిధ్యాన్నీ కాపాడటానికి కొన్ని సూచనలు చేశారు. ‘ఎ గ్లోబల్‌ డీల్‌ ఫర్‌ నేచర్‌’ (+ణచీ) పేరుతో అదొక పాలసీ విషయంగా రూపుదాల్చింది. 2030 నాటికి కనీసం 30 శాతం భూమి ఉపరితలాన్ని రక్షించాలని పథకాలు రూపొందించారు. భూమి ఉపరితలం రక్షించబడితే దాని మీద ఉన్న వృక్ష, జంతు జాతులు కూడా రక్షించబడతాయి. స్వాభావికంగా భూమి మీద ఉన్న కార్బన్‌ నిలువలు కాపాడబడతాయి. అయితే ఇది అంత తేలికగా అయ్యే పనేమీ కాదు. సంవత్సరానికి వంద బిలియన్‌ డాలర్లు ఖర్చవుతాయన్నది ఒక అంచనా.
వివిధ భాషా సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వం సాధించుకుని విరాజిల్లుతున్న మన భారత దేశంలో వైవిధ్యం ఎక్కువ. భిన్నత్వాన్ని ఎవరైనా చిన్నాభిన్నం చేయదలుచుకుంటే, వైవిధ్యాన్ని సహించలేక పోతున్నారని అర్థం. వైజ్ఞానిక పరంగానైనా, సామాజిక పరంగానైనా వైవిధ్యం దెబ్బతింటే అది వినాశనానికే దారి తీస్తుంది. పర్యావరణానికి, జీవ వైవిధ్యానికీ హాని కలగని ఒక శుభ్రమైన, మానవీయ విలువలతో కూడిన, హేతుబద్ధమైన సమాజాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం, తక్షణం ఉండనైతే ఉంది.